జూన్ నెలాఖరు నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని పశు సంక్షేమ శాఖ భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.
రెండో విడత గొర్రెల పంపిణీతో పాటు.. మార్కెట్లు, షెడ్ల నిర్మాణం, పశువుల ఆరోగ్య సంరక్షణ, టీకాల పంపిణీ వంటి పలు అంశాలపై మంత్రి విస్తృతంగా చర్చించారు. రెండో విడత కోసం ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మంజూరు చేసినా.. తీవ్రమైన ఎండలతో గ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో, వర్షాకాలం ప్రారంభమైన వెంటనే పంపిణీని చేపడతామని ఆయన వివరించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్భందీగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో 3, 66, 976 మంది లబ్ధిదారులకు 77. 06 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు తలసాని గుర్తు చేశారు.
అన్ని జిల్లాల్లో గొర్రెల మార్కెట్లు..
ప్రభుత్వం.. గొర్రెల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పెద్దపల్లిలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. కామారెడ్డి, ఖమ్మం, వనపర్తిలలో కూడా త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మిగతా జిల్లాల్లో మార్కెట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణా బ్రాండ్‌తో విక్రయాలు..
తక్కువ ధరకే.. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందజేయాలనే ఉద్దేశంతో తీసుకురానున్న తెలంగాణా బ్రాండ్ విక్రయాలను వీలైనంత త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.