Balkampet Yellamma: వచ్చే నెలలో జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూలై 5న అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోలు, 5న కల్యాణం, 6న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సీసీ కెమెరాలతో భద్రత: అమ్మవారి కల్యాణానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా.. ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోనాల పండుగలో ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నట్లు వివరించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడ కూడా సీవరేజి లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్ వర్స్క్ అధికారులను మంత్రి ఆదేశించారు.