Talasani on Chandrababu Naidu Arrest :చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాజా పరిణామాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అధికార బలంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలగచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Talasani Respond on Naidu Arrest : ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం అని వ్యాఖ్యానించారు. 73 ఏళ్ల వయసులో ఉన్న బాబును అరెస్ట్ చేయడం, విచారణ పేరిట 26 రోజులుగా ఇబ్బందులకు గురిచేయడం ఏ మాత్రం సరికాదని అన్నారు. కనీసం ఆయన హోదా, వయస్సుకైనా సరే గౌరవం ఇవ్వాల్సిందని.. విచారణ అంటే సరైన పద్ధతులు ఉంటాయని చెప్పారు.
పెద్ద నేత అరెస్ట్ అంటే ఓ ప్రొసీజర్ ఉంటుందని.. ఈ విషయంలో ఏదీ కూడా పాటించడం లేదని.. ఇది సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంటే ఎలా కుదురుతుంది..? ఇవాళ అధికారం ఉంటుంది.. రేపు మరొకరు అధికారంలో వస్తారు.. అప్పుడేంటి పరిస్థితి అని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో తాను మంత్రిగా పనిచేశానని మంత్రి తలసాని పేర్కొన్నారు.