కేంద్రం రూపొందించిన ముసాయిదా పాలసీపై చర్చించి సూచనలు సలహాలు తీసుకున్నామని.. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యా విధానంలో చేసిన మార్పులను కేంద్రానికి తెలియజేశామన్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో రాష్ట్రంలో తీసుకున్న పలు కార్యక్రమాలు కనిపిస్తున్నాయని మంత్రి తెలిపారు. విద్యావ్యవస్థ ఎలా ఉండాలో ఏపీ సీఎం జగన్ విస్తృతంగా చర్చించి నిర్ణయించారని.. సీఎం జగన్ ఆలోచన విధానం కేంద్రం రూపొందించిన ముసాయిదాలో కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏడాది క్రితమే మానవ వనరుల శాఖను విద్యాశాఖగా సీఎం జగన్ మార్చారని పేర్కొన్నారు. ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మార్చిందన్నారు.
'మేం సూచించిన 2 అంశాలు సహా పలు అంశాలు పొందుపరిచారు. అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రాన్ని కోరాం. దేశంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ పెట్టాలని కేంద్రానికి సూచించాం. కేంద్రం నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లులోని అంశాలను రాష్ట్రంలో అమలు చేస్తాం. జవాబుదారితనం, పారదర్శకత,లక్ష్యంగా విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు పై కసరత్తు చేస్తున్నాం. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము సమర్థిస్తున్నాం. నూతన విద్యా విధానంలో పొందుపరిచిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తాం.' మంత్రి సురేశ్ చెప్పారు.