చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పురాతన వారసత్వ వస్తుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అలనాటి అరుదైన వస్తు సంపద సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని భద్రపరుస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళ పేరిట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. ఆదివాసీ, గిరిజనులు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, వివిధ ఆకృతులను ఒక్క చోటుకు చేర్చి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.
MINISTER SRINIVAS GOUD: పురాతన వస్తుసంపద సంరక్షణ.. మనందరి బాధ్యత - ఆద్య కళ ఎగ్జిబిషన్
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళ పేరిట ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్లో ఆదివాసీలు, గిరిజనులు వినియోగించిన సంప్రదాయ కళాకృతులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సందర్శించారు.
ప్రదర్శనలోని వాయిద్య సాధనాలు, విగ్రహాలు, వివిధ ఆకృతులు, చిత్రాలను భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇలాంటి అరుదైన వస్తుసంపదను వెలకట్టలేమని వెల్లడించారు. ఇందుకోసం కృషి చేసిన ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు బృందానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జయదేవ్ తిరుమల రావు పేరును పద్మశ్రీ అవార్డు కోసం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Gandhi Trust: 67 ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుల ఆశయం.. కళ్ల ముందే అన్యాక్రాంతం