తెలంగాణ

telangana

ETV Bharat / state

తాటి, ఈత చెట్లు నరికేస్తే నాన్​ బెయిలబుల్ కేసు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తాటి, ఈత చెట్లను నరికేస్తే నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గీత కార్మికులకు ఇచ్చే పరిహారం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

minister srinivas goud review with higher officials, minister srinivas goud review
గీత కార్మికుల సంక్షేమం కోసం శ్రీనివాస్ గౌడ్ సమీక్ష, ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

By

Published : May 8, 2021, 8:42 PM IST

గీత వృత్తికి సంబంధం లేని వారు... గీత వృత్తితో భాగస్వామ్యం లేనివారు కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని ఆయన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులకు వివరించారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం చెందిన గీత కార్మికులకు ఇచ్చే పరిహారం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు.

మూడు నెలల్లో నీరా కేఫ్

పరిహారాన్ని రైతు బీమా మాదిరిగా వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీ సభ్యులకు, టీఎఫ్​టీ లైసెన్సుదారులకు గుర్తింపు కార్డులను వెంటనే జారీ చేయాలని సూచించారు. అనుమతి లేకుండా తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. అర్హులైన గీత కార్మికులకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పింఛన్లు అందించాలన్నారు. ట్యాంక్ బండ్​పై నిర్మిస్తున్న నీరా కేఫ్, నందనంలో నీరా, దాని ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాల నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎక్సైజ్ నర్సరీల ఏర్పాటు

ప్రతి జిల్లాకేంద్రంలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీల్లో హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జూర, గిరక తాళ్ల మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచాలని సూచించారు. వర్షాకాలంలోనే ఈ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాటి, ఈత చెట్లకు నంబర్లు రాసి సంరక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వివేక్, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, ఆబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, ఉన్నతాధికారులు ఖురేషి, చంద్రయ్య, రఘురామ్, గణేష్, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నారసింహుని క్షేత్రానికి స్వర్ణ శోభ.. విమాన గోపురానికి పసిడి కళ

ABOUT THE AUTHOR

...view details