Review on Drugs Usage in Pubs: డ్రగ్స్ అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పబ్బుల యాజమానులు, ఎక్సైజ్ అధికారులతో.. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై మంత్రి సమీక్షించారు. పబ్బులు పాటించాల్సిన నియమాలు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఉపేక్షించబోం
డ్రగ్స్ కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి వంటివి సరఫరా చేస్తూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలదే బాధ్యత అని పేర్కొన్నారు. పబ్బుల్లో కార్యకలాపాలను యాజమాన్యాలు గుర్తించాలని సూచించారు. శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పబ్బుల్లో కార్యకలాపాలు యాజమాన్యాలు గమనించాలి: మంత్రి
"పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలదే బాధ్యత. పబ్బుల్లో కార్యకలాపాలు యాజమాన్యాలు గమనించాలి. కార్యకలాపాలు చూడలేకపోతే పబ్బులు మూసివేయాలి. శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. డ్రగ్స్ సరఫరాపై 1800 425 2523 నెంబర్‌కు తెలపాలి." -శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
ఒడిశా, ఏపీలలో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నారని...అక్కడి నుంచి గంజాయిని కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వారిని గుర్తించి అరెస్టు చేసి పీడీ యాక్టులు పెడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ వినియోగం పబ్బుల్లో ఎక్కువగా ఉందని తమ దృష్టికి వచ్చిందని.. ఎక్సైజ్, పోలీసు బృందాలు ఎప్పటికప్పుడు పబ్బులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన నైజీరియన్లను వారి వారి దేశాలకు పంపించివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:Congress Protests: 'నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ.. ప్రభుత్వ హత్యలే'