Srinivas Goud on MLC Kavitha ED Enquiry: ఎమ్మెల్సీ కవిత తాను ఏ ఫోన్లను ధ్వంసం చేయలేదని గతంలోనే చెప్పారని.. తాను వాడిన చరవాణిలను నేడు ఈడీకి అప్పగించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కవిత ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పిన కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే కవిత భయపడటం లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను ఎదుర్కోలేక తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఒక మహిళపై వారి ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను కేంద్రం ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఎక్కడున్నారన్న ఆయన.. దేశ సంపదను దోచుకుని లండన్ పారిపోయిన వారిని ఎందుకు రప్పించట్లేదని నిలదీశారు. లక్షల కోట్లు కొల్లగొట్టిన కేసులను వదిలేసి రూ.100 కోట్ల స్కామ్ అంటూ మహిళపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఒక మహిళ అని కూడా చూడకుండా గంటల కొద్దీ కూర్చోబెట్టి వేధిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే స్కామ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అలాంటి వాటిపై దృష్టి సారించాలని హితవు పలికారు. బీజేపీని ప్రశ్నించిన వారిపైనే ఐదారు వేల కేసులు పెట్టారన్న శ్రీనివాస్ గౌడ్.. ఆ పార్టీలో చేరగానే వదిలేశారని తెలిపారు. కమలం పార్టీలో చేరగానే అవినీతిపరులు శుద్ధి అయ్యారా అని మంత్రి నిలదీశారు.