తెలంగాణ సంస్కృతి, పండుగలను గత పాలకులు అవహేళన చేశారని... ఇప్పడు ఆత్మగౌరవంతో నిర్వహించుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రకృతిని పూజించి, ఆరాధించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని... కేవలం ఒక తెలంగాణలోనే ఉందన్నారు. ప్రకృతి బాగుంటేనే ప్రజలు బాగుంటారని... ప్రకృతి సహకారం లేకుంటే మనిషికి మనుగడే లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గౌరిపూజ చేశారు.
అన్నపూర్ణగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని... పంటలు బాగా పండుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి అవకాశం లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రం ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందని తెలిపారు. కరోనా కారణంగా బతుకమ్మ వేడుకలను ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే జరుపుకోవాలని సూచించారు.