తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రాష్ట్ర భాజపా నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సంతోషం, సంబరాల్లో ప్రజలు ఉండగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారని మంత్రి ఆరోపించారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాకు కేటాయించారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టామని.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏడేళ్లలోనే తెలంగాణ.. హరిత విప్లవానికి కేంద్రమైన పంజాబ్‌ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి అన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా పంజాబ్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం... తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసిందని మండిపడ్డారు.
'అభివృద్ధి దిశలో కొనసాగుతున్న రాష్ట్రాలకు నిధులు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రంలో చలనం లేదు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్‌లో రైల్వే కోచ్, ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏమయ్యాయి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్నీ రాష్ట్రంలో కేంద్రం అమలు చేయలేదు.'