Satyavati Rathod Comments on Vande Bharat train : బీజేపీ ప్రభుత్వం ఆలోచన విధానాలు, అమలు.. ధనికులకే తప్ప పేదవాళ్లకు ఉపయోగకరంగా లేవని మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం వందే భారత్ వంటి వేగవంతమైన ట్రైన్లు ప్రారంభించి ఎవరికి లాభం చేకూరుస్తున్నారని ప్రశ్నించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రారంభించడం హర్షించదగ్గ విషయమే అయినా.. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న రైలు కాదన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న మంత్రి.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. 18వ రైలు ప్రారంభోత్సవానికి ఇంత హంగు, ఆర్భాటాలు, ప్రచారాలు ఎందుకో చెప్పాలన్నారు.
హై స్పీడ్ ట్రైన్ ప్రారంభించి అదే అభివృద్ధి అని చెప్పుకోవడం.. ఇదేనా మోదీ మార్క్ డెవలప్‌మెంట్ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుగానీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని తెలిపిన ఆమె.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కొన్ని దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతున్నా వాటిని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.