లాక్డౌన్ సందర్భంగా అంగన్వాడీ పిల్లలు ఇంటి వద్దే ఉండి విజ్ఞానాన్ని పొందేలా మహిళా, శిశు సంక్షేమ శాఖ చిన్న కథలతో ఆన్లైన్ పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆన్లైన్ పాఠాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా లాక్డౌన్ సమయంలో అంగన్వాడీల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు, అంగన్వాడీ లబ్ధిదారులకు అందుతున్న సరుకులు, సేవలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కష్టకాలంలోనూ అంగన్వాడీ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని మంత్రి అభినందించారు. మహిళా కార్పొరేషన్ ద్వారా తయారు చేయించిన మాస్కులను సిబ్బందికి రెండో విడతగా అందించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన శానిటైజర్లను సైతం పంపిణీ చేశారు.
బాలికల కోసం ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ అందించిన 2 లక్షల శానిటరీ న్యాప్కిన్లను స్వదార్ హోమ్, సఖీ సెంటర్లు, కనీస సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలకు పంపిణీ చేశారు. అజీమ్ప్రేమ్జీ ఫౌండేషన్ సమకూర్చిన రూ. 15 లక్షల విలువైన సరుకులను 10 చిల్డ్రన్ హోమ్స్, 21 ఓల్డేజ్ హోమ్స్‌కు అందించారు.
ఇవీచూడండి:మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన