ఏజన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులను వందశాతం గిరిజనులతో భర్తీ చేయాలన్న జీవో 3ను పునరుద్ధరించేలా సుప్రీంకోర్టులో 3-4 రోజుల్లో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో జీవో 3 వచ్చినందున.. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి రివ్యూ పిటిషన్ వేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏపీని సంప్రదించి నివేదిక రూపొందించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలతో ముసాయిదా తయారుచేసి సీనియర్ న్యాయవాదులు, నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాస్తున్నట్లు వివరించారు.