తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవితకాల ఆశ, ఆకాంక్షను నెరవేర్చి.. 9వేల గ్రామపంచాయతీలను 12వేలకు పెంచామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ... 500 జనాభా కన్న తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు, తండాలకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో పాటు.. గిరిజన ప్రత్యేక ప్రగతి నిధి కింద అదనపు నిధులిచ్చి... గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో వివరించారు. గిరిజన ఉప ప్రణాళిక, గిరిజన తండాలు, గ్రామ పంచాయతీల నిర్వహణకు నేరుగా 5శాతం నిధులు ఇస్తున్నారా? అంటూ సభ్యుడు రఘునందన్ రావు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యవతి రాఠోడ్ సమాధానం చెప్పారు.