Satyavathi Rathod Review on TS Decade Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, మహిళా ప్రాంగణాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మహిళా, శిశుసంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
డాక్యుమెంటరీలకై కసరత్తు:తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అధికారులతో సచివాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. తొమ్మిదేళ్ల అభివృద్దిపై డాక్యుమెంటరీలు సిద్దం చేయాలని చెప్పారు. తొమ్మిదేళ్లలో గిరిజన సంక్షేమ, మహిళా - శిశు సంక్షేమ శాఖల్లో జరిగిన మార్పులు, అభివృద్ధిని అందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని సత్యవతి రాథోడ్ తెలిపారు. తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి మొదలు గిరి వికాసం, సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ వంటి అనేక పథకాల ద్వారా లబ్దిదారుల వివరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ఇతర సౌకర్యాలు వీడియోలతో డాక్యుమెంటరీలు రెడీ చేసి పబ్లిక్కు వివరించాలని మంత్రి ఆదేశించారు.
అభివృద్ధి పథకాలను వివరిస్తూ: తొమ్మిదేళ్ల క్రితం గిరిజనుల పరిస్థితి ఇప్పుడు ఉన్న అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, లబ్ది పొందుతున్న వారి వివరాలు డాక్యుమెంటరీల్లో ఉండాలని మంత్రి సత్యవతి రాఠోడ్ చెప్పారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లాల్లో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలు, మహిళా ప్రాంగణాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్దిదారుల వివరాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. త్వరితగతిన వీడియోలను పూర్తిచేయాలని అధికారులు, డాక్యుమెంటరీ ఏజెన్సీలను మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు.
సాధించిన అభివృద్ధి ప్రజలకు తెలిసేలా:జూన్ 2 నుంచి 21 వరకు నిర్వహించాల్సిన దశాబ్ది ఉత్సవాల నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. తొమ్మిదేళ్ల పాటు ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, తెలంగాణలో మారిన పరిస్థితులు, జీవన విధానం, ఉద్యోగాలు, పరిశ్రమలు, రిజర్వేషన్ల గురించి డాక్యుమెంటరీల ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను డాక్యుమెంటరీలుగా చేసి వాటిని ప్రజలకు ప్రతి గ్రామంలో ఆవిష్కరించనున్నారు. ప్రత్యేక తెలంగాణ తర్వాత తెలంగాణ ప్రస్థానం ఎలా సాగింది అనే అన్ని అంశాలను డాక్యుమెంటరీలో నిక్షిప్తం చేయనున్నారు. వివిధ శాఖలకు చెందిన మంత్రులు వారి వారి శాఖల్లో జరిగిన అభివృద్ధి గురించి డాక్యుమెంటరీ రూపకల్పన కోసం అన్ని రకాలుగా కసరత్తులు చేసుకున్నారు.
ఇవీ చదవండి: