తెలంగాణ

telangana

ETV Bharat / state

satyavathi rathod: 'గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు సిద్ధం చేయండి' - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖకు సంబంధించిన విద్యాసంస్థల పున: ప్రారంభంపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

satyavathi
satyavathi

By

Published : Aug 25, 2021, 8:33 PM IST

రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నందున గురుకుల, ఆశ్రమ పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులకు సూచించారు. విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని తెలిపారు. పక్షం రోజుల పాటు గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా తండాలు, గూడేల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని తెలిపారు. ఏ ఒక్కరూ పాఠశాలలో చేరకుండా ఉండొద్దని తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్​లో పాఠశాలలకు పంపేలా చూడాలని అన్నారు. గ్రామాల్లో ఉన్న అంగన్​వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్​వాడీలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

మరమ్మతులు చేపట్టండి

కొవిడ్ కారణంగా మూతపడ్డ విద్యాసంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, కావల్సిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని మంత్రి తెలిపారు. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు 20వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్ - జీసీసీ ద్వారా సమన్వయం చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచేలా హెల్త్ కమాండ్ సెంటర్ నిర్వహించాలని సత్యవతి రాఠోడ్ తెలిపారు.

కొవిడ్​ నిబంధనలు పాటించేలా..

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని... శానిటైజేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:TS schools reopen : రేపటి నుంచి బడులకు ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details