బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మహబూబాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. వివాహాల సమయంలో అడ్డుకోవడం కాకుండా ముందునుంచే అందరిలో భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బాల్యవివాహాల నిర్మూలనపై మహిళా, శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో మంత్రి వెబినార్ నిర్వహించారు.
బాల్యవివాహాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి: సత్యవతి రాఠోడ్ - బాల్యవివాహాలపై వెబినార్
బాల్యవివాహాలను అరికట్టేందుకే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బాల్యవివాహాల నిర్మూలనపై అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో ఆమె వెబినార్ నిర్వహించారు.
విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా... సమాజంలో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండడం దురదృష్టకరమని... బాల్యవివాహాలతో ఆడపిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా గిరిజనులు, పేదవాళ్లు ఉన్న ప్రాంతమని... ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయని సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆలస్యమయ్యే కొద్ది సరైన సంబంధం దొరకకపోవచ్చనే భయం తల్లిదండ్రుల్లో ఉంటుందని అన్నారు. బాల్యవివాహాలను అరికట్టేందుకే సీఎం కేసీఆర్ 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయడాన్ని ప్రోత్సహించేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.
అన్ని అవకాశాలు, సాంకేతికత పెరిగినా బాల్యవివాహాలపై సరిగ్గా అవగాహన కల్పించడం లేదని... వాటిని నియంత్రించకుండా చివరి నిమిషంలో పెళ్లి ఆపడం వల్ల ఆ కుటుంబంపై ఆర్థికంగా భారం పడడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి అన్నారు. బాల్యవివాహాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని... పరిస్థితులను అర్థం చేసుకుని.. వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు ఉండాలని మంత్రి సూచించారు. బాల్యవివాహాలు నేరమనే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు. మతపెద్దలను కూడా భాగస్వామ్యుల్ని చేయాలన్నారు. బాల్యవివాహాలకు సంబంధించి ఆడపిల్ల తల్లిదండ్రుల కంటే అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని, జీవితం ఇబ్బందుల పాలవుతుందని వివరించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.