దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర గిరిజనుల సంక్షేమం, భద్రత, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారాన్ని రూ.వంద కోట్లతో నిర్వహిస్తున్నారని... జోడెఘాట్లో రూ.50కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేశారని తెలిపారు. నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె రెండో జన్మదిన వేడుకలు హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, అభిమానులు, అధికారులు, పార్టీ నేతల మధ్య ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమం, సంస్కృతి ప్రగతి నివేదిక లఘు చిత్రాన్ని మంత్రి విడుదల చేశారు.
పారిశ్రామికవేత్తలుగా...
హైదరాబాద్ బంజారాహిల్స్లో రూ.వంద కోట్లకు పైగల భూమిలో రూ.50కోట్లతో బంజారా భవన్, కుమురం భీం భవన్లు... వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతిని కాపాడడంతో పాటు వారి సమగ్ర వికాసమే ధ్యేయంగా... వారిని పారిశ్రామికవేత్తలుగా చేసే లక్ష్యంతో ఎంటర్ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం అమలు చేస్తున్నారని తెలిపారు. ఐఎస్బీ వంటి ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్లో శిక్షణ ఇప్పించి, డీపీఆర్లు రూపొందించి... ఎసీబీఐ ద్వారా రుణాలు ఇప్పించి అనేక ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందం కుదిర్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నారని వివరించారు.