Sabita Indra Reddy On SSC Exams: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదన్న మంత్రి.. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్కే భవన్ నుంచి మంత్రి సబితా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి సమీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందన్న మంత్రి.. పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దు: ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.