తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్​ రెండో వారంలో ఇంటర్మీడియట్​ ఫలితాలు: మంత్రి సబిత - ఇంటర్మీడియట్​ ఫలితాలు

ఇంటర్మీడియెట్ ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్ ఇవాళ మొదలైందని.. ఈనెల 12 నుంచి మూల్యాంకనం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వాయిదా పడిన ఇంటర్మీడియట్ మోడరన్ లాంగ్వేజెస్, జాగ్రఫీ పరీక్షను ఈనెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతిస్తే.. అన్ని జాగ్రత్తలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని.. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పాఠశాలలు ఎప్పటి నుంచి పునప్రారంభించాలనే అంశంపై కసరత్తు చేసి... లాక్ డౌన్ అనంతరం నిర్ణయిస్తామన్నారు

minister sabitha indrareddy educational review
జూన్​ రెండో వారంలో ఇంటర్మీడియట్​ ఫలితాలు: మంత్రి సబిత

By

Published : May 7, 2020, 4:38 PM IST

ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంబించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 12 నుంచి మూల్యాంకనం నిర్వహించి.. నెలాఖరు వరకు పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కి పెంచినట్లు పేర్కొన్నారు. మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులకు చెందిన 53 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉందని తెలిపారు. మూల్యాంకన కేంద్రాల్లో కరోనా నివారణ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వివరించారు. మూల్యాంకన సిబ్బందికి రవాణ, వసతి సదుపాయాలు సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైకోర్టు అనుమతిస్తే పదోతరగతి పరీక్షలు

లాక్​డౌన్ కారణంగా మార్చి 23న జరగాల్సిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మోడరన్ లాంగ్వేజెస్, జాగ్రఫీ పరీక్షను ఈనెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిగిలిపోయిన ఇంటర్మీడియట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 856 మంది రాయాల్సి ఉందన్నారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఏర్పాట్లపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షల కోసం హైకోర్టు అనుమతి తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో బెంచిపై ఒకే విద్యార్థి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామని.. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా 2500 పరీక్ష కేంద్రాలుండగా.. వాటిని రెట్టింపు చేస్తామన్నారు. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

విద్యాసంస్థలు రుసుముల కోసం ఒత్తిడి చేయెుద్దు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం వంటి జాగ్రత్తలు ఏ విధంగా చేపట్టాలో కొంత కసరత్తు చేయాల్సి ఉందన్నారు. లాక్​డౌన్ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. విద్యాసంస్థలు ఎట్టిపరిస్థితుల్లోనూ రుసుముల కోసం ఒత్తిడి చేయవద్దని సబితా ఇంద్రారెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.

ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ABOUT THE AUTHOR

...view details