ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో ప్రకటించారు. కరోనా వల్ల విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ఇప్పటికే టీ శాట్ ద్వారా 80 శాతం సిలబస్ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని మంత్రి వివరించారు.
టీశాట్ ద్వారా 80 శాతం సిలబస్ పూర్తి చేశాం: సబితా ఇంద్రారెడ్డి - జూనియర్ కళాశాల వివరాలను వెల్లడించిన మంత్రి
రాష్ట్రంలో టీశాట్ ద్వారా ఇప్పటికే 80 శాతం సిలబస్ పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తర సమావేశాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 445 మండలాల్లో విద్యాశాఖ, అన్ని సంక్షేమ శాఖలతో కలుపుకుని 1201 జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 404 ప్రభుత్వ, 38 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరో 759 జూనియర్ కాలేజీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో స్టూడెంట్ కౌన్సిలర్‌ను నియమించామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.