Minister Puvvada on TSRTC Charges: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రగతిరథ చక్రాలు పరుగులు తీస్తాయి... తప్ప వెనక్కి తగ్గేదిలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. సెస్‌ల పేరుతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల భారం మోపుతున్నా.. సవాళ్లను అధిగమిస్తూ ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ కలిసి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని కోరుతామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. గతంలో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని సీఎంను కలిసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి మంత్రి పువ్వాడతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి.. ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాలలో 50 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. లాభాల్లో ఉన్న నవరత్న కంపెనీలను కేంద్రం అమ్ముతున్నా... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పువ్వాడ తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నామని... ఎలక్ట్రిక్ బస్సులు వాడితే డీజిల్ ధరల భారం తగ్గించుకోవచ్చునని మంత్రి పేర్కొన్నారు. ఎంప్లాయ్ సోపైటీని కూడా మళ్లీ పునరుద్ధరణ చేస్తామని పువ్వాడ స్పష్టం చేశారు.
'కేసీఆర్ సారథ్యంలో ప్రగతిచక్రాలు పరుగులే తీస్తాయి. ఆర్టీసీ విభజన సమస్యలు కేంద్రం ఇప్పటికీ పరిష్కరించలేదు. సెస్‌ల పేరుతో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం భారం మోపుతోంది. ధరలు పెంచుతూ కేంద్రం మాత్రం రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని అడుగుతుంది. ఇదెక్కడి న్యాయం.? పెంచేది మీరు.. తగ్గించేది మేమా?. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని గతంలోనే సీఎం కేసీఆర్‌ను కలిశాం.. ముఖ్యమంత్రిని మళ్లీ కలిసి ఛార్జీలు పెంచాలని కోరుతాం. ఆర్టీసీ గాడిన పడాలంటే ఛార్జీలు పెంచక తప్పదు.' -పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి
తార్నాక ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ప్రయాణికుల ఆదాయమే కాకుండా ఇతరత్రా ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెడుతున్నామని ఛైర్మన్ పేర్కొన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియమాకాలకు కూడా బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులు 6 నెలలుగా సమ్మె చేస్తున్నారని.. దేశ వ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని.. కానీ తెలంగాణలో మాత్రం కొంత మెరుగ్గా ఉందని వెల్లడించారు.