TSRTC Launched Electric Buses : పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు టీఎస్ఆర్టీసీ 'ఈ-గరుడ'గా నామకరణం చేసింది. ఈ బస్సులను హైటెక్ హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకి ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు: రాబోయే రెండేళ్లలో ఆర్టీసీ కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలోనూ.. అలాగే 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. అయితే భాగ్యనగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ఇవాళ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభోత్సవంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మఖ్య అతిథిగా హాజరయ్యారు.
అందుబాటులోకి వచ్చిన 'ఈ-గరుడ': టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 'ఈ-గరుడ' బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి హైటెక్ హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు.