Swagruha Plots Sale: స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై గృహనిర్మాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంపగుత్తగా బ్లాకుల వారీగా అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఫ్లాట్లను విడిగా అమ్మాలని నిర్ణయించింది. సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై విధివిధానాల రూపకల్పనకు అధికారులతో ఆయన బుధవారమిక్కడ చర్చించారు. ఫ్లాట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు రుసుంను రూ.1,000 (తిరిగివ్వని/నాన్ రిఫండబుల్)గా నిర్ణయించారు.
ప్రత్యేక యాప్:‘సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు.. ఆసక్తి కలిగినవారు మీ-సేవా ద్వారా, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి వస్తుంది. అర్హులకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది. పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు www.swagruha.telangana.gov.inసైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి’ అని మంత్రి వేముల అధికారులకు సూచించారు.
మోడల్ హౌస్‌లు:కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్ హౌస్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఆసక్తి కలిగినవారు అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, స్వగృహ కార్పొరేషన్ సీఈ ఈశ్వరయ్య, ఈఈ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.