పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం రెండు నెలల్లోగా పూర్తి కావాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, నిపుణులతో సమావేశమైన మంత్రి.. పనుల పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
పారిస్‌లో ఈఫిల్ టవర్, దుబాయ్‌లో బూర్జు ఖలీఫా తరహాలో హైదరాబాద్‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించవచ్చని తెలిపారు. నగరం నలువైపులా ఉన్న ముఖ్య ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ కోట, కేబీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ చూపరులకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కన్పిస్తాయని అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూజియం..
రానున్న రోజుల్లో ఏడాది పొడవునా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే వివరాలు, తెలంగాణ విజయాలు, పోలీసు శాఖ, కమాండ్ కంట్రోల్ సెంటర్ వివరాలను అందులో పొందుపర్చనున్నట్లు వివరించారు. ప్రముఖ నిపుణులు వసీంఖాన్, వారి భాగస్వాముల ఆధ్వర్యంలో మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.