Minister Prashant Reddy Fires On Bandi Sanjay : చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం.. ఆనతి కాలంలోనే దేశంలో అగ్రభాగానికి చేరుకుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది చెందిందని.. గణాంకాలతో సహా పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులే ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడానికి యువ నాయకుడు కేటీఆర్ చేసినంత కృషి ప్రధాని కూడా చేయలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థతో రాష్ట్ర సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ పిల్లలు ప్రజా ఆమోదంతో రాజకీయాల్లో ఉన్నారని.. ఉద్యమం కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమేనని.. బండి సంజయ్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదని ఆయన ఘాటుగా స్పందించారు
ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కీలకం : తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి, ఎన్నో కేసులు, అరెస్టులు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. యువ నాయకుడు కేటీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో రూ. 3లక్షల కోట్ల పెట్టుబడులు,18వేల కంపెనీలు,16 లక్షల ఉద్యోగాలు లభించాయని అన్నారు. ప్రపంచ ప్రముఖ దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌ను, కేటీఆర్ చొరవను సదరు సంస్థల సీఈఓలు బహిరంగ వేదికల మీదనే కొనియాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.