Perni Nani Comments: సినీ పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఎంతో కృషి చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ విషయంలో ఆయన్ను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.
చిరంజీవి సినీ పరిశ్రమ కోసమే ఆలోచించి ఒక రిలీఫ్ తీసుకొచ్చేందుకు కృషి చేశారన్నారు. చిన్న సినిమాల గురించి తన ఆవేదనను నటుడు నారాయణమూర్తి సీఎంకు వివరించారని చెప్పారు. సీఎం కూడా స్పందించి చిన్న సినిమాలకూ అవకాశం ఉండాలని సినీ ప్రముఖులను కోరారన్నారు. దీనిపై సినీ ప్రముఖులంతా స్పందించి మాట్లాడారని.. చిన్న సినిమాలు బతకాలని వారూ చెప్పారని పేర్ని నాని తెలిపారు. చిన్న సినిమాల అంశంలో తామంతా మాట్లాడుకుంటామని వారు చెప్పారన్నారు.
ఏపీలోనూ సినిమా షూటింగులు జరపాలని సినీ ప్రముఖులను సీఎం జగన్ కోరారని పేర్ని నాని తెలిపారు. విశాఖలో పెద్ద ఎత్తున షూటింగులు జరిగేలా చూడాలని సీఎం కోరారని.. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారన్నారు. రాష్ట్రంలో తెలుగు సినిమాల షూటింగులు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ తమకు హైదరాబాద్ ఎంతో ఏపీ కూడా అంతేనని.. ఇక్కడా షూటింగులు జరుపుతామని చెప్పారని పేర్ని నాని వివరించారు. ఈ విషయంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు చెప్పారు.