Niranjan reddy: త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక, వ్యవసాయశాఖలకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి స్పష్టం చేశారు. గత తరహాలోనే ఈ వానాకాలం కూడా సకాలంలో సొమ్ము జమ చేస్తామన్నారు. రైతులెవరూ అపోహ పడవద్దని తెలిపారు. ఎకరా నుంచి 2, 3,4, 5 ఎకరాల చొప్పున రైతు బంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కొంత ఆలస్యం జరగింది. కేంద్రం సహకరించకపోయినా రైతుబంధును గతంలో లాగే ఇస్తాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్ల ఆలస్యం అవడం జరిగింది. - నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రైతులకు తెలిపేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసం ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాలైన సేకరించడానికి కాల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు.