నాలుగైదు మాసాలుగా వరి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతుంటే... ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వలేదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్రం వరి కొనుగోలు చేయకపోతే... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి... ఇప్పటివరకు వరి కొనుగోళ్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు.
లేఖ తీసుకొస్తే నేనే రాజీనామా చేస్తా
''వరి కొనుగోళ్లపై ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఏడేళ్ల కాలంలో వ్యవసాయన్ని అద్భుతంగా మలిచాం. రైతుబంధును అమలు చేశాం. రైతుకు మేలు చేసేలా కేంద్రం ఒక్క పథకాన్ని అయినా అమలు చేసిందా? కేంద్రం కొంటామంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నట్లు ఇక్కడ భాజపా నేతలు దీక్షలు చేస్తున్నారు. నాలుగేళ్లకు సరిపడా నిల్వలున్నాయి.. ధాన్యం కొనలేమని కేంద్రం లేఖ పంపింది. భాజపా నేతలు దేనికోసం దీక్ష చేస్తున్నారో చెప్పాలి. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఇంత గందరగోళం చేస్తారా? అయితే మీకో సవాల్ విసురుతున్నాను. దీక్షలు చేయండి బండి సంజయ్. కేంద్రం ప్రతిగింజా కొనేవరకు భాజపా నేతలు దీక్ష చేయండి. రాష్ట్రంలో యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి. సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రం నుంచి లేఖ తీసుకురండి. రాష్ట్రంలో 63 లక్షల ఎకరాల్లో వరిసాగు అయింది. తెలంగాణలోని 60 లక్షల రైతుల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోంది. మీకు చిత్త శుద్ధి ఉంటే సాయంత్రం 5 లోగా లేఖ తీసుకురండి. లేదంటే మీ పదవులకు రాజీనామా చేయండి. ఒకవేళ మేము చెప్పింది తప్పని రుజువు చేస్తే వ్యవసాయ మంత్రిగా రాజీనామా చేస్తాను.''
-మంత్రి నిరంజన్ రెడ్డి