Niranjan Reddy Review on Rythu Bandhu: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక రైతుబంధు పథకం అమలు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ముద్ర అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాల వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
అసాధారణ విజయం...
ఈ ఏడాది యాసంగి సీజన్ పురోగతి, ప్రత్యామ్నాయ వ్యవసాయ పంటల సాగు, క్షేత్ర స్థాయిలో క్లస్టర్ల వారీగా ఏఈఓల స్వయంగా పంటల నమోదు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర ఓ వజ్రంలాంటిదని కీర్తించారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంగా నిలిచిందని చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని సైతం తెలంగాణ మించడం అసాధారణ విజయమని కొనియాడారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణే...
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారని కితాబు ఇచ్చారు. కరోనా విపత్తులో ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ సేవలు అనిర్వచనీయమని స్పష్టం చేశారు. ఈ 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చిన డబ్బులు మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని అన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.