రాష్ట్రంలో సాంప్రదాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో రాయితీ విత్తనాల సరఫరా, ఎరువులు, ప్రభుత్వ పథకాలు, పంటల మార్పిడి తదితర అంశాలపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ రబీ కోసం వేరుశనగ విత్తనాల సరఫరా పూర్తైన దృష్ట్యా శనగ విత్తనాలు ఎంత అవసరమైతే... అంత మేరకు రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి నిరంజన్‌రెడ్డి... ఉన్నతాధికారులను ఆదేశించారు.
రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలి..
ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రబీ సీజన్‌లో గతం కన్నా ఎక్కువగా వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్న ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన అంచనాలతో వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. పంట మార్పిడి కింద నువ్వుల పంటను ప్రోత్సహిస్తూ రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు.