తెలంగాణ

telangana

ETV Bharat / state

Niranjan Reddy Review on Monsoon Crops : 'స్వల్పకాలిక పంటల సాగుపై రైతులను చైతన్యం చేయండి' - వానాకాలం పంటల సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

Niranjan Reddy Review on Monsoon Crops Cultivation : రైతులకు పంటల సాగుపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా స్వల్ప కాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే వర్షాలు సాగుకు సహకరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది వరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదును దృష్ట్యా నాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు.

Niranjan Reddy Review on Monsoon Crops
Niranjan Reddy Review on Monsoon Crops

By

Published : Jul 19, 2023, 5:40 PM IST

Minister Niranjan Reddy review on Agriculture : రాష్ట్రంలో ఆలస్యమైనా.. వర్షాలు సాగుకు సహకరిస్తుండటంతో వ్యవసాయం ఆశాజనంగా ఉందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సచివాలయంలో వానా కాలం సీజన్‌ పురోగతిపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్‌కుమార్, టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు, ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. తాజాగా కురుస్తోన్న వర్షాలు, ఇప్పటి వరకు పంటల సాగు, విస్తీర్ణం, సరళి, రసాయన ఎరువులు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని.. వరి నాట్లు జోరందుకున్నాయని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల సాగు నీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం ఉన్నత స్థాయిలో, రెండుసార్లు వ్యవసాయ శాఖ తరపున సమీక్ష చేశామని అన్నారు.

Minister Niranjan Reddy review at secretariat : క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా స్వల్ప కాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన ప్రకారం... కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవచ్చని స్పష్టం చేశారు. మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈ నెలాఖరు వరకు అనుకూలమని.. ఇది వరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదును దృష్ట్యా నాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలని, ఫలితంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసి వస్తుందని అన్నారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుందని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

తెలంగాణలోని 32 జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని.. ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన 5 జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించామని గుర్తు చేశారు. గత ఏడాది అధిక వర్షాల వల్ల ఆయిల్‌పామ్ సాగుకుఆటంకాలు ఏర్పడ్డాయని.. ఈ ఏడాది అన్నీ సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటడం పూర్తైనందున మరో 75 వేల ఎకరాల్లో మొక్కలు నాటు కోవడానికి ఆన్‌లైన్‌లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న దృష్ట్యా అందాల్సిన రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారులు ఆయిల్‌పామ్ సాగుకు రైతులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా ఆయిల్‌పామ్ సాగుకు ఎంపిక చేసిన జిల్లాల్లో వెంటనే ఇతర జిల్లాల నర్సరీల నుంచి మొక్కలు ఇచ్చి వెంటనే నాట్లు వేయించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details