Minister Niranjan Review on Kharif Fertilizers: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల కొరత సాకుగా చూపి కేంద్రం.. రాష్ట్రాలకు ఎరువుల సరఫరా జాప్యం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి ఇది సముచితం కాదని ఆక్షేపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ సంబంధించి రసాయన ఎరువుల ముందస్తు నిల్వలు, కేటాయింపులు, గ్రామాలకు చేరవేత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అప్పటిలోగా సిద్ధం చేయాలి: రాబోయే వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల మేర కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కేటాయించిందని మంత్రి అన్నారు. వీటిలో 10.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ, ఎస్ఎస్‌పీ చొప్పున సరఫరా చేసేందుకు ఆమోదించిందని చెప్పారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.