కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని.. అలాగే వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. తాజా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో రసాయన ఎరువులు, రైతు వేదికల నిర్మాణంపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్, సంయుక్త సంచాలకులు విజయగౌరి, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో భవనాలను పరిశీలించిన మంత్రి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున రైతుల నుంచి యూరియా, కాప్లెక్స్, ఇతర ఎరువులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా.. ఎరువులు అందుబాటులో ఉంచాలని.. ఎక్కడా కొరత అన్న మాట వినిపించొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా, ఎరువుల కోటా ఎప్పటికప్పుడు డ్రా చేయాలని సూచించారు. రాష్ట్రంలో రేక్ పాయింట్ల నుంచి మండలాల వారీగా ఎంపిక చేసిన స్టాక్ పాయింట్లకు ఎరువులు తరలించి సిద్దంగా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలిస్తూ మానిటరింగ్ చేయాలని కోరారు.