Niranjan Reddy on Paddy: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంత పోరాడినా కేంద్రం తన వైఖరి మార్చుకోవట్లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అందుకే యాసంగిలో రైతులు వరి వేయొద్దని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు వేదికల ద్వారా వ్యవసాయశాఖాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడారు.
కొనుగోళ్లతో రాష్ట్రానికి సంబంధం లేదు
Niranjan Reddy on Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంపీలు కేంద్రంతో పోరాడుతున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్రానికి సంబంధం లేదని తెలిపారు. ధాన్యం డబ్బులను కేంద్రం చాలా రోజులకు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. అందువల్లనే రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముందే డబ్బులు చెల్లించేదని వెల్లడించారు.
బాయిల్డ్ రైసు విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రమే
Niranjan Reddy on Boiled Rice: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్ర ప్రభత్వమే ప్రవేశపెట్టిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. రైతుల విషయంలో కేంద్రానిది అవకాశవాద ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. ఒక్కో ప్రభుత్వ సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. ధాన్యం విషయంలో పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమంటే రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేనని విమర్శించారు. రాజకీయాల కోసం రైతులను, ప్రజలను భాజపా మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు రైతుల దీక్షలు కనిపించడం లేదని దుయ్యబట్టారు. రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసేది తెరాస మాత్రమేనని నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలంలో అకాల వర్షాలతో తడిసినా ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నామని రంగు మారిన కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.