కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలు కొనడంలో కేంద్రం రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.
వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవాలి: నిరంజన్‌రెడ్డి
కొత్త వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలు కొనడంలో రాద్దాంతం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
ధాన్యం సేకరణలో కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీస మద్దతు ధరకు మించి ప్రత్యక్షంగా, పరోక్షంగా బోనస్ ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. పత్తి సేకరణ విషయంలో కేంద్రం సీసీఐ ద్వారా ఒక రైతుకు కేవలం 40 క్వింటాళ్ల వరకే కొనుగోలుకు అనుమతిస్తోందని... దానికి మించి తీసుకొస్తే రీ వెరిఫికేషన్ చేయాలని రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు...? అంటూ ధ్వజమెత్తారు.
రైతులు పట్టాదారు పాస్‌బుక్... లేదంటే వారి రక్త సంబంధీకుల రేషన్, ఆధార్ కార్డులతో మాత్రమే రావాలని మరో షరతు ఎందుకని ఆక్షేపించారు. రాష్ట్రంలో రైతుబంధు డాటా ఉన్నందున.. ఈ నిబంధన ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో షరతులపై ప్రభుత్వం తరఫున సీసీఐకి లేఖలు రాశామని తెలిపారు. రైతులకు సంఘీభావంగా మంగళవారం అలంపూర్ టోల్ ప్లాజా వద్ద మంత్రి ధర్నా, రాస్తారోకోలో పాల్గొననున్నారు.