కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ (Oil Palm) విత్తన మొలకలపై పెంచిన సుంకాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) సూచించారు. దిగుమతి సుంకం పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటరిగిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Central Minister Nirmala Seetharaman)ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాశారు. దేశంలో నూనె ఉత్పత్తుల స్వయం సంవృద్ధికి తోడ్పడాలని మంత్రి తెలిపారు. పెంచిన దిగుమతి సుంకం నేపథ్యంలో దేశం, రాష్ట్రంలో ఆయిల్ పామ్ అభివృద్ధికి భారీ నష్టం జరుగుతోందన్నారు.
ఆయిల్‌పామ్‌కు ప్రాధాన్యత...
ఆయిల్‌పామ్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఇక్కడి నేలలు కూడా సాగుకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సాగునీటి వసతి 24 గంటల కరెంటు సరఫరా, ఎకరాకు రూ. 5వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు రైతుబంధు పథకాలతో సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యంలో భాగంగా ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యత కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలలో యుద్ధ ప్రాతిపదికన... రాబోయే 2022, 2023 సంవత్సరాలలో 3 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో నిరంజన్ రెడ్డి వివరించారు. దేశంలో ఆయిల్‌పామ్ సాగుకు అవసరానికి తగినంత విత్తన తోటలు లేనందున కోస్టారికా, థాయ్‌లాండ్, మలేషియా దేశాల నుంచి విత్తన మొలకలు దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు.