NABARD Credit Plan 2022- 23 in Telangana: రూ. లక్షా 66 వేల 384 కోట్లతో.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను.. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు- నాబార్డ్ రూపొందించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో రుణ ప్రణాళికను.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని మంత్రి సూచించారు. వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని.. నాబార్డ్ సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని నిరంజన్‌రెడ్డి వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నామని.. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమ
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాబార్డ్ సూచనల మేరకు రైతులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. వీటి నిర్వహణకు బ్యాంకర్ల సహకారం అవసరమని.. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని.. యువత ఇటువైపు వస్తోందని వెల్లడించారు. వారికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.