niranjan reddy on bandi letter :రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ లేఖ రాయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తీరు... ''హంతకుడే సంతాపం తెలిపినట్లుందని'' మండిపడ్డారు. గత యాసంగి సీజన్‌లో వరి పంట సాగు చేస్తే వచ్చిన ధాన్యం కేంద్రం చేత కొనిపిస్తానని రైతులను రెచ్చగొట్టి పారిపోయి... ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొన్నాక తీరిగ్గా డబ్బులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు.
అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత, రైతు సమస్యల గురించి నోరెత్తే అర్హత బండి సంజయ్‌కు ఉందా? అని ప్రశ్నించారు. సుతిల్ తాళ్లు, దబ్బనాలు, గోనె సంచులకు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని... ధాన్యం కొనుగోలు చేస్తుందని బీరాలు పలికిన సంజయ్... సీఎంకు ఎందుకు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగితం కూడా ఉండదా? అని ఎద్దేవా చేశారు.
పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్‌నోట్లు విడుదల చేయడంతో పాటు మరుసటి రోజు పత్రికలు చదివితే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో... వ్యవసాయ శాఖ ఎక్కడ ఉంది? అది రాష్ట్రంలో ఏం చేస్తుంది...? అన్న విషయం కూడా తెలుస్తుందని హితవు పలికారు. ప్రెస్‌నోట్లు, ప్రెస్‌మీట్లు మినహా భాజపా రాష్ట్రంలో ఏం చేస్తుంది? ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రానికి తీసుకొచ్చారా? కనీసం ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ది కోసమైనా ఒక్క రూపాయి తెచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు.