తెలంగాణ

telangana

ETV Bharat / state

Fake seeds: నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ చట్టం: నిరంజన్​రెడ్డి - telangana news 2021

నాసిరకం విత్తన కంపెనీలు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారిపై ఇప్పటికే 177 కేసులు నమోదు చేసి, 3,468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నకిలీ విత్తనాల విక్రయాలు, ముఠాల అక్రమ వ్యాపారాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.

నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ చట్టం: నిరంజన్​రెడ్డి
నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ చట్టం: నిరంజన్​రెడ్డి

By

Published : Jun 12, 2021, 5:21 AM IST

రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమార్కులెవరైనా దొరికితే పీడీ చట్టం కింద కేసు నమోదు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ హాకా భవన్‌లో నకిలీ విత్తనాల విక్రయాలు, ముఠాల అక్రమ వ్యాపారాలపై మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో పోలీస్​శాఖ ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది వానాకాలం-విత్తన సరఫరా, నాసిరక విత్తనాల నియంత్రణ, అక్రమార్కులపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున నకిలీ విత్తనాలను ఉపేక్షించే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో నకిలీ విత్తన తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే నాసిరకం విత్తన కంపెనీలు, విక్రయదారులపై 177 కేసులు నమోదు చేసి, 276 మందిని అరెస్టు చేశామని.. 3,468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఈ సందర్భంగా విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. విత్తన లైసెన్సుల జారీ కాలపరిమితి నిర్దేశించి నిర్ణీత సమయంలో ఇవ్వాలని సూచించారు. మరోవైపు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నేడు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

Action: కరోనా నిబంధనలు గాలికొదిలేసి... అధికారుల దావత్

ABOUT THE AUTHOR

...view details