కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఏకపక్షంగా గెజిట్ విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను బలిపెట్టే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. నిర్దిష్ట కాల వ్యవధిలో నీటి పంపకాలకు ట్రైబ్యునల్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.
నదీ జలాల అంశం తెలంగాణ ప్రజల జీవన్మరణాల సమస్యగా నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతం, జనాభా అధికంగా కలిగి ఉన్నామన్న ఆయన... రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నా నీటిని పొందలేని దుస్థితిలో ఉన్నట్లు ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమం ప్రధానంగా నీళ్లను ఇతివృత్తంగా చేసుకున్నది. తెలంగాణ బతుకంతా నీళ్ల చుట్టే తిరిగింది. నీళ్లు లేకనే అల్లాడింది. నీళ్ల కోసమే పోరాడింది. రాష్ట్రం వచ్చాకా నీళ్లు తెచ్చుకోవడమే ప్రధాన పనిగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కేంద్రం అవలంభిస్తున్న తీరు ఇప్పుడు మేల్కొని ఎప్పుడో చేయవల్సిన పని ట్రైబ్యునల్‌ను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోమంటే.. ఆపని చేయకుండా అవసరమైన పని చేయకుండా.. రెండు నదుల మీద ఉండేటటువంటి యాజమాన్యపు హక్కులను ప్రాజెక్టులను కాల్వలను పవర్ స్టేషన్లను అన్నింటిని మా పరిధిలోకి తీసుకుంటామనే విధంగా ఇవాళ కేంద్రం గెజిట్ విడుదల చేయడమనేది ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవడమే.