Niranjan Reddy Comments On Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో తెరాసను తరిమికొట్టాలని వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో పడిన కష్టాలు, జరిగిన నష్టాలను తెలంగాణ సమాజం మర్చిపోలేదని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ సభలో ఇచ్చిన హామీలను, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి రాహుల్‌గాంధీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో.. సమాజం ఎంతో చైతన్యవంతమైందన్న విషయాన్ని రాహుల్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. ఏడేళ్లుగా కేంద్రం నుంచి అందుతున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని వెల్లడించారు.
దిల్లీ నుంచి వచ్చిన రాహుల్ నాలుగు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ పౌరులను వలసల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనాలని కేంద్రాన్ని రాహుల్ ఎక్కడా డిమాండ్ చేయలేదన్నారు. రాష్ట్రంలో భాజపా గెలవాలని కాంగ్రెస్ ఆరాటమని స్పష్టం చేశారు. కేంద్రం చేతులెత్తేస్తే.. కేసీఆర్ ధాన్యం కొంటున్నారన్న ఆయన.. భాజపా, కాంగ్రెస్‌లకు వ్యవసాయ రంగంపై ఒక విధానమంటూ లేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు నేలకేసికొట్టారని మంత్రి విమర్శించారు. గాంధీ కుటుంబ వారసత్వమే రాహుల్‌కున్న అర్హత అని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.