Minister Mallareddy gave scholarships to the students: తనదైన స్టైల్లో చమత్కారంగా మాట్లాడే మంత్రి మల్లారెడ్డి తాజాగా తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇచ్చే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తనదైన శైలిలో మాట్లాడి విద్యార్థులను మోటివేట్ చేశారు. రెడ్డి జనసంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు.
హైద్రాబాద్ అబిడ్స్ లోని రెడ్డి వసతి గృహ సమావేశ మందిరంలో రెడ్డి జన సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 326 మంది నిరుపేద విద్యార్థులకు 27లక్షల ఉపకార వేతనాలను సంఘం నాయకులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి... చిరిగిన జీన్స్ వేసుకొని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవుతారని చురకలంటించారు. తాను 23వ ఏటా ఒక సైకిల్ రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల వయస్సు గల వారేనని మల్లారెడ్డి యువతకు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం దేశంలో నంబర్ వన్ గా ఉందని.. యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు.