తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్.. నీ బిడ్డ పెళ్లికి నేనే పైసలిచ్చిన..: మల్లారెడ్డి - రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి కామెంట్స్

Malla Reddy Comments on Revanth Reddy: తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి అడుగడుగునా తనను బ్లాక్‌మెయిల్‌ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తను విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Malla Reddy Comments on Revanth Reddy
రేవంత్ రెడ్డి పై విరుచుకు పడిన మల్లారెడ్డి

By

Published : May 24, 2022, 2:20 PM IST

రేవంత్.. నీ బిడ్డ పెళ్లికి నేనే పైసలిచ్చిన..: మల్లారెడ్డి

Malla Reddy Comments on Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. తెదేపాలో ఉన్ననాటి నుంచి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. భూములు చట్టబద్ధంగానే కొన్నానని... లీగల్‌గా వెళ్లి రేవంత్‌ను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు. రేవంత్ బిడ్డ పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని... యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అంటూ నిలదీశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డిపై మల్లారెడ్డి మండిపడ్డారు.

'నేను ఎక్కడా భూములను ఆక్రమించుకోలేదు. నా విద్యాసంస్థలు, యూనివర్సిటీల కోసం చట్టబద్ధంగానే భూములను కొన్నా. రేవంత్‌రెడ్డి అడుగడుగునా నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నడు. ఇద్దరం తెదేపాలో ఉన్న సమయంలోనూ రేవంత్ నన్ను వదల్లేదు. మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం ఇద్దరికీ పోటీ ఉండేది. సీటు జోలికొస్తే కాలేజీలు మూయిస్తానని బెదిరించిండు. ఆయన కుమార్తె వివాహం ఖర్చులకు నేనే డబ్బులిచ్చిన. అందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ప్రమాణం చేయడానికి రేవంత్‌ సిద్ధమేనా..?' -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండరని.. రేపు భాజపాలో చేరినా ఆశ్చర్యం లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే 2024లో ప్రాంతీయ పార్టీలతో కలిసి సీఎం కేసీఆర్‌ దేశాన్ని పాలించడం ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పెట్టుబడుల కోసం దావోస్ వెళితే రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌లోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details