హైదరాబాద్‌లో వర్ష ప్రభావిత కాలనీలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... మూడో రోజు పరిశీలించారు. ఖైరతాబాద్ లోని బీఎస్ మక్త కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించి, అక్కడ అందిస్తున్న సౌకర్యాలపైన మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటించారు.
జీహెచ్ఎంసీ ప్రయత్నం...
వరద వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేషన్ కిట్లతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టగా కాలనీలు వరద నుంచి తెేరుకుంటున్న తరుణంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన కేటీఆర్ ప్రజలంతా కచ్చితంగా తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కాచివడ పోసిన నీటిని తాగాలన్నారు.
భరోసా...
వరద ప్రభావిత కాలనీలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం షెల్టర్ హోమ్‌లలో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతో పాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నామని తెలిపారు. బీఎస్ మక్తలో ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్, వైద్య శిబిరాన్ని, అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. షెల్టర్ హోమ్‌లో ప్రస్తుతం బస చేసిన ప్రజలతో మంత్రి మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.
ప్రాధాన్యత...
ఇళ్లలో నుంచి పూర్తిగా వరద నీళ్లు తగ్గేవరకు షెల్టర్ హోమ్‌లో ఉండొచ్చని, ఇందుకోసం అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. షెల్టర్ హోమ్ నుంచి ఇళ్లకు వెళ్లిన తర్వాత పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో అవసరమైతే జీహెచ్ఎంసీ సహాయం తీసుకోవాలని సూచించారు.