KTR Letter to Nirmala Sitharaman : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ఎనిమిదేళ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని.. రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులకు జాతీయ ప్రాధాన్యత ఉందని తెలిపారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడమంటే దేశానికి సహకరించినట్లే అన్న కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు రానున్న కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోంది: తెలంగాణకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందన్న కేటీఆర్.. రాష్ట్రం అభివృద్ధి పట్ల తన నిబద్ధత చాటుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్ ఉత్తమ సందర్భమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను రానున్న కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వినూత్న పారిశ్రామిక విధానాలతో తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందన్న కేటీఆర్.. భారీ పెట్టుబడులకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మాసిటీ లాంటి భారీ పారిశ్రామిక పార్కులు కేవలం తెలంగాణకే కాకుండా జాతీయ ప్రాధాన్యత కలిగి దేశ పారిశ్రామిక అభివృద్ధికి సైతం ఇతోధికంగా ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు.
చివరి బడ్జెట్‌లోనైనా సానుకూలంగా స్పందించాలి:మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలు, విధానాలను కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ లాంటి అభివృద్ధికాముఖ రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు బలంగా మారినప్పుడే దేశ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక రంగంలో స్వల్ప కాలిక ప్రస్థానంతోనే అత్యంత కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి రానున్న కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రతి బడ్జెట్ సందర్భంగా ప్రోత్సాహకంగా దక్కాల్సిన నిధులపై అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం అందలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడే పలు అంశాలపై సానుకూలంగా స్పందించాలని కోరారు.