జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు భాజపా సిద్ధమవుతుంటే.. తెరాస సైతం అంతే దీటుగా బదులిస్తోంది. కాషాయ పార్టీ సమావేశాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రధాని మోదీకి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. 'ఆవో- దేఖో- సీఖో' ప్రధాని మోదీజీ అంటూ తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-పరిపాలనను అధ్యయనం చేయాలని.. డబుల్ ఇంజిన్తో ప్రజలకు ట్రబుల్గా మారారని కేటీఆర్ విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు అమలు చేయాలని.. నూతన అలోచనా విధానానికి నాంది పలకాలని సూచించారు.
భాజపా కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన అజెండాపై చర్చ వద్దని.. అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడాలని కోరారు. పార్టీలోనే విద్వేషం, సంకుచిత్వాన్ని నింపుకున్నారని.. ప్రజలకు ఉపయోగపడే విషయాలు చర్చిస్తారనుకోవడం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మోదీ మాట్లాడలేరని.. భాజపా అసలైన 'అజెండా.. విద్వేషం.. సిద్ధాంతం.. విభజన' అని ఆరోపించారు. ప్రధాని మోదీ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారన్న కేటీఆర్.. మోదీకి ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యముందని అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలి..: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేస్తే కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కార్యవర్గ సమావేశాల్లో చర్చించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను వదులుకుని.. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలన్నారు.
ఓయూలో నిరసన..: మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాకను నిరసిస్తూ ఓయూలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడుస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని రాష్ట్రానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు.