Minister KTR review on heavy rains: భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్నిశాఖలు పనిచేయాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ నుంచి అధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల, పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగంగా ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కూడా ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని మంత్రి చెప్పారు. పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.