Minister KTR USA Tour Latest Updates : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..తాజాగా జాప్ కామ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికాకు చెందిన ప్రాడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్ కామ్ సీఈవో కిషోర్ పల్లంరెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులు, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్, స్థిరాస్తి రంగాలకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలు అందిస్తుంది. దీని ద్వారా తొలుత 500 మందికి ఉపాధి లభించనుంది. ఏడాది కాలంలో ఈ సంఖ్య వెయ్యికి పెరుగుతుందని జాప్‌కామ్ సంస్థ ప్రకటించింది.
డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు రౌండ్ టేబుల్ సమావేశం..:వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు, అంకురాలు, వాటి ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం వృద్ధి, డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలను కేటీఆర్ వారికి వివరించారు.