భారత ధాన్యాగారంగా అవతరించడమే కాకుండా తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కువైట్, మధ్య ఈశాన్య దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు తెలంగాణ సోనా రకం బియ్యం ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు... 2015లో రూపొందించిన ఈఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం బియ్యంలో చక్కెర శాతం తక్కువ, బహుళ పోషకాలు ఉన్న దృష్ట్యా స్వల్ప వ్యవధిలో చక్కటి ఆదరణ చూరగొంది. టైప్-2 మధుమేహులకు మంచి ఔషధం లాంటిది.
తొలి విడతలో కువైట్‌కు...
తాజాగా తొలి విడతగా కువైట్‌కు 24 టన్నులు బియ్యం ఎగుమతయ్యాయి. మరో రెండు మాసాల్లో మరికొన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు బేఫ్యాచ్ 4ఎక్స్ ప్రైవేటు లిమిటెడ్, యూనివర్సిటీ మార్కెటింగ్ భాగస్వామి రాజేశ్ తెలిపారు. తెలంగాణ సోనా బియ్యం ఆన్‌లైన్ వేదికగా మార్కెటింగ్ నెట్‌వర్కింగ్ విస్తృతం చేయడంలో బేఫ్యాచ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ కువైట్‌లో పెద్ద డిస్ట్రిబ్యూటర్గా ఉంది. మార్చిలోగా మరో 200 టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు కువైట్ ప్రభుత్వం అంగీకరించింది.
చిట్టిమల్లెలలుగా ప్రసిద్ధి...
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడుమ కాలువ కింద అధిక విస్తీర్ణంలో వరి పంట సాగయ్యే నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల వరి రైతుల నుంచి బేఫ్యాచ్ బియ్యం సేకరిస్తోంది. ఇప్పటికే బియ్యం సేకరణ కోసం 200 మంది డీలర్లను కూడా నియమించుకుంది. నాణ్యమైన, రుచికరమైన తెలంగాణ సోనారకం బియ్యం... చిట్టి మల్లెలుగా కూడా ప్రసిద్ధి. చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలకు ఈ బియ్యం ఎగుమతి చేసేందుకు బేఫ్యాచ్ 4ఎక్స్ ప్రైవేటు లిమిటెడ్ వర్గాలు సన్నాహాలు చేస్తుండటం విశేషం.
ఇదీ చదవండి:'రాష్ట్రంలో మే నెలలో పదో తరగతి పరీక్షలు'